విశాఖపట్నాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం (AP development Visakhapatnam)క్రమంగా కార్యరూపం దాలుస్తోంది. ఈ దిశగా తొలి అడుగుగా, జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ ఐసాయి (Eisai) వచ్చే మార్చిలో విశాఖపట్నంలో తన తొలి జీసీసీని ప్రారంభించనుంది.
ఐసాయి, ఎన్‌టిటి సంస్థలతో విశాఖ ఐటీ రంగానికి కొత్త ఊపు
2009 నుంచి ఐసాయి సంస్థ విశాఖపట్నానికి సమీపంలోని పరవాడ రామ్‌కీ ఫార్మా సిటీలో ఔషధాల తయారీ, ఎగుమతులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ విధానాన్ని ప్రకటించిన వెంటనే విశాఖలో కేంద్రం ఏర్పాటు చేయడానికి సంస్థ ముందుకు రావడం విశేషం. ఐటీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ జీసీసీ మార్చిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఐసాయి తర్వాత జపాన్‌కు చెందిన మరో దిగ్గజ సంస్థ నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్‌టిటి) కూడా విశాఖపట్నంలో జీసీసీ ఏర్పాటు చేయనుంది. మొబైల్, ఇంటర్నెట్, ఐటీ, కన్సల్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోటోనిక్స్ రంగాల్లో 190 దేశాలకు సేవలందిస్తున్న ఈ సంస్థకు 70 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
AP development Visakhapatnam: రుషికొండ ఐటీ పార్క్‌లో లీజులు
రుషికొండ ఐటీ పార్క్ హిల్-2లోని ‘ఇన్‌స్పైర్‌ఎడ్జ్’ భవనంలో ఎన్‌టిటి ఒక విభాగాన్ని లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇదే భవనంలో ప్రపంచ ప్రఖ్యాత దుస్తుల సంస్థ లూలెమన్ కూడా తన జీసీసీని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్లో టాటా క్లిక్‌తో భాగస్వామ్యంపై ఈ సంస్థ చర్చలు జరుపుతోంది.
అదేవిధంగా రహేజా, ఏఎన్‌ఎస్‌ఆర్ వంటి సంస్థలు కూడా విశాఖలో జీసీసీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఐటీ శాఖ కార్యదర్శి కటమనేని భాస్కర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 200 జీసీసీలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు. మార్చిలోనే జపాన్‌కు చెందిన రెండు జీసీసీలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఇదే సమయంలో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్‌ఎంజెడ్ కార్పొరేషన్ విశాఖపట్నం (AP development Visakhapatnam)లో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భూమి కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తోంది.
పెట్టుబడులను ఆకర్షిస్తున్న విధానాలు
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగం కోసం 30 కొత్త విధానాలను ప్రకటించింది. ఇందులో జీసీసీలకు ప్రత్యేక విధానం కూడా ఉంది. వార్షికంగా బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన బహుళజాతి సంస్థలకు ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తోంది. మధ్యతరహా సంస్థలకు ఎకరాకు రూ.10 కోట్ల విలువైన భూమిని సుమారు రూ.4 కోట్లకే అందిస్తోంది.
కొత్త పారిశ్రామికవేత్తలకు ప్లగ్-అండ్-ప్లే ఇంక్యుబేషన్ సదుపాయాలు, అద్దె రాయితీలు వంటి ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఈ విధానాల నేపథ్యంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రాగా, కాగ్నిజెంట్ 21 ఎకరాల్లో ఐటీ క్యాంపస్ నిర్మిస్తోంది. టీసీఎస్‌కు 20 ఎకరాలు కేటాయించగా, తాత్కాలిక కార్యకలాపాల కోసం మిలీనియం టవర్స్‌లో పూర్తి భవనాన్ని వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. క్యాప్‌జెమిని కూడా విశాఖలో ఉద్యోగుల క్యాంపస్ నిర్మాణానికి భూమి కొనుగోలు విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
దావోస్‌కు సీఎం చంద్రబాబు
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 19 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశాలు, ముఖాముఖి చర్చల్లో పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి వివిధ ప్లీనరీ సెషన్లు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, ప్యానెల్ చర్చల్లో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. మొత్తం మీద దావోస్ పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 22న తిరుగు ప్రయాణం ప్రారంభించి, జనవరి 23న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.